వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌కు ఆమోదం

కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదంతో నగ ర రూపురేఖలు మారనున్నాయి. సౌకర్యాల కల్పనతో పాటు సంపద వృద్ధి కానుంది. ప్రజలకు కనీస వసతులు కల్పించడంతో పాటు వారి జీవన ప్రమాణాలు పెంచే విధంగా అడుగులు పడనున్నాయి. కుడా పరిధిలో అన్ని ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు రానున్నాయి. ముఖ్యంగా దశాబ్దాల తరబడి భూ వినియోగ మార్పు సమస్యతో ఇబ్బంది పడుతున్న నగర ప్రజలకు మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదంతో ఊరట లభించింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడనుంది. ప్రతి నిర్మాణానికి అనుమతులు రానుండడంతో గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌కు భారీగా ఆదాయం సమకూరనుంది. 1971 నాటి మాస్టర్‌ ప్లానే ఇప్పటి వరకు అమలవుతున్న పరిస్థితుల్లో నగరంలోని అనేక ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు రాక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఏళ్ల తరబడి భూ వినియోగ మార్పు కోసం సెక్రటేరియట్‌ చుట్టూ తిరిగే పరిస్థితులకు తెరపడింది. కొత్త మాస్టర్‌ ప్లాన్‌తో శివారు ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందను న్నాయి. దీంతో నగరంలో భూ విలువ మరింత పెరుగనుంది. రియల్‌ బూమ్‌ ఊపందుకోనుంది.